పెళ్లి కి ముందే మాట్లాడుకోవాలి.

పెళ్లి కి ముందే మాట్లాడుకోవాలి.


* పనివేళలు, పనితీరు కూడా   ముందే మాట్లాడుకోవాలి.
* పెళ్లయ్యాక పెద్దవాళ్ల బాధ్యత ఏ మేరకు అనేదీ ముఖ్యమే...
* ఆర్థిక వ్యవహారాలపై స్పష్టత ఉంటే... సమస్యలు దూరం.
* వ్యక్తిగతం, వృత్తిజీవితం సమన్వయం కూడా అవసరమే!


‘పెళ్లయ్యాక ఉద్యోగం మానేశా...’ అనే రోజులు కావివి. ఆడపిల్లలు కూడా అబ్బాయిలతో సమానంగా రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. జీవితంలో రాణిస్తున్నారు. మరి కెరీర్ -వైవాహిక బంధం సజావుగా, పూల నావలా సాగాలంటే పెళ్లికి ముందు కాబోయే జంటలు చేసుకోవాల్సిన ఒప్పందాలేంటో చూద్దామా...
బాగా చదుకోవడంతోనే నేటి తరం అమ్మాయిల ఆలోచనలు ఆగిపోవట్లేదు. పలు రంగాల్లో స్థిరపడుతూ నింగికి నిచ్చెన వేస్తున్నారు. అయితే పెళ్లి తరువాత చాలామంది అమ్మాయిల జీవితం వాళ్లు అనుకున్నట్లు ఉండట్లేదు. వృత్తిగతంగా, వ్యక్తిగతంగా ఒత్తిడికి లోనవుతూ ఉద్యోగాలు మానేసే స్థితికి చేరుకుంటున్నారు. అలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే... పెళ్లికి ముందే ఇద్దరూ కలిసి కెరీర్ గురించి చర్చించుకోవడం ఎంతైనా అవసరం.
* సంజాయిషీ లేకుండా... ఈ రోజుల్లో కార్పొరేట్ ఉద్యోగులకు ఓ సమయం అంటూ ఉండదు. కెరీర్లో దూసుకుపోయే క్రమంలో గంటల తరబడి ఆఫీసులో ఉండాల్సిన పరిస్థితి. ఇది పెళ్లికి ముందు ఒకే. కానీ భాగస్వామి వచ్చాక సమస్య కావొచ్చు. అందుకే ముందే కాబోయే భార్యాభర్తలు తమ ఉద్యోగం, పనివేళల గురించి చర్చించుకోవాలి. ఉద్యోగం కాకుండా వ్యాపార ఆలోచన ఉన్నా వివరించాలి. ఒకవేళ ఉద్యోగాల పరంగా ఇద్దరూ చెరోచోట ఉండాల్సి వస్తుందేమో కూడా మాట్లాడుకోవాలి. పరిణతి, అర్థం చేసుకునే తత్వం ముందే అలవర్చుకుంటే చాలా సమస్యలు ఎదురుకావు. అలాగే వ్యక్తిగత జీవితానికి ఎంత సమయం కేటాయిస్తారనేదీ మాట్లాడుకోవాలి.

కుటుంబ బాధ్యతలు...  

ఈ కాలం ఆడపిల్లలు తల్లిదండ్రుల గురించీ ఆలోచిస్తున్నారు. అందుకే తల్లిదండ్రుల పట్ల మీకు ఉండే బాధ్యత, వారిని ఎంత వరకూ చూస్తారనేదీ వివరంగానే చెప్పాలి. జీతంలో ఎంత మొత్తం కేటాయిస్తారు... ఏ రూపాల్లో వారికి అండగా ఉంటారనేదీ స్పష్టత ఇవ్వాలి. అదే సమయంలో భాగస్వామి కుటుంబ సభ్యులకూ అంతే ప్రాధాన్యం ఇస్తాననీ చెప్పాలి. అంటే భార్యాభర్తలిద్దరూ తమతోపాటు.. తమ వెంట ఉండే కుటుంబసభ్యులకూ సమప్రాధాన్యమివ్వాలి.
* ఆర్థిక వ్యవహారాలు ముఖ్యమే... ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు పరస్పర జీతాల పట్ల స్పష్టత అవసరం. అలానే లోన్లు, ఇతర రుణాల వంటివి చర్చించుకోవాలి. చాలామంది ఇవి పెళ్లయ్యాక చూసుకోవాల్సిన వ్యవహారాలనుకుంటారు. కానీ ఈ చర్చ పెళ్లికి ముందే ఉండాలి. ఇంటి ఖర్చులు, పొదుపు, ఆరోగ్య బీమా... అన్నీ మాట్లాడుకోవాలి. వీలైతే పెళ్లయ్యాక ఇద్దరూ కలిసి ఉమ్మడి ఖాతా తెరిచి... అందులోనూ దాచుకోవచ్చు. ఇల్లు కొనుగోలు, పిల్లలు, చదువులు... వంటి దీర్ఘకాలిక అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఎలా పొదుపు చేయాలనే చర్చ కూడా అవసరమే. అప్పుడే నీది, నాది అనే భావన పోయి అభద్రతలు దూరమవుతాయి.
* పిల్లలు ఎప్పుడు...  పాతికేళ్ల లోపులో పెళ్లయితే కొన్నాళ్లు పిల్లల్ని వాయిదా వేసినా ఫర్వాలేదు. అదే ముప్హ ఆపైన అయితే మాత్రం త్వరగా పిల్లల్ని కనేయమంటున్నారు నిపుణులు. అందుకే పెళ్లికి ముందు పెద్దల నుంచి ఈ విషయంలో సమస్యలు ఎదురుకాకుండా... వయసుల్ని దృష్టిలో పెట్టుకుని ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకోవాలి. పెద్దలకూ ఓ మాట చెబితే పిల్లల బాధ్యత తీసుకునేందుకు ఎవరో ఒకరు చొరవ చూపుతారు. మీ ఉద్యోగానికి సమస్య ఉండదు.

బంధాలకే విలువ
- ఇంద్రానూయి


ఎన్ని బరువు బాధ్యతలున్నా... ఉన్నత పదవిలో ఉన్నా నేను ఓ సామాన్య తల్లిదండ్రులకు కూతురిని. ఓ భర్తకి భార్యనని మర్చిపోను. అందుకే నా కుటుంబ బంధం ఇలా సంతోషంగా సాగుతోంది. మా పెళ్లికి ముందే నా భర్తకి అలానే ఉంటానని మాటిచ్చా. ఈ రోజు వరకూ అలానే కొనసాగుతున్నా.

నటిస్తానని ముందే చెప్పా
- సమంత అక్కినేని


పెళ్లితో చాలామంది అమ్మాయిల జీవితం మారిపోతుంటుంది. కాని దాన్ని జీవితంలో భాగంగా చూడాలి తప్ప... అదే జీవితం అనుకోకూడదు. మా పెళ్లికి ముందే కెరీర్ గురించి చైతో చర్చించా. తనే ముందుగా వాళ్లింట్లో నేను సినిమాల్లో కొనసాగుతానని చెప్పి నాకు ధైర్యమిచ్చాడు. ఆ స్పష్టత ఉంటే గనుక గొడవలు ఉండవు.

ఎక్కడున్నా పక్కనున్నట్టే
- అనుష్క శర్మ


మనం ఎక్కడ ఉన్నాం... అనేది కాదు  అనుబంధంతో కలిసి ఉంటున్నామా లేదా అనేదే ముఖ్యం. మా ఇద్దరి వృత్తిరీత్యా ఏ రోజు ఎక్కడ ఉంటామో తెలియదు. పెళ్లి తరువాత ఒకరి పట్ల మరొకరికి అంచనాలు పెరుగుతాయని ముందే ఓ ప్రణాళిక వేసుకున్నాం. ఇద్దరికీ విరామం దొరికినప్పుడే ప్రేమ పక్షుల్లా విహరించాలనుకున్నాం. ఒకరి వృత్తిలో మరొకరం కలగజేసుకోం. అందుకే బంధం సాఫీగా సాగుతోంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చాణక్య ప్రకారం, ఇలాంటి వారు ఎప్పటికీ ధనవంతులు కాలేరు, కారు..

గోత్రం

This is wealth