స్నేహం
"స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం', 'స్నేహమే నాకున్నదీ, స్నేహమేరా పెన్నిధీ!" అనే పాట మరపురానిది. ఎందుకంటే అది స్నేహబంధాన్ని గురించిన సృజన కాబట్టి. అన్ని సంబంధాల కన్నా స్నేహసంబంధం చాలా గొప్పదని ఎందుకు చెబుతున్నామంటే, అందులో స్వేచ్ఛ వుంటుంది. ప్రజాస్వామికతత్వం ఉంటుంది. పరస్పర గౌరవ భావన వ్యక్తం అవుతుంది. తన సహచరుడు బాగుండాలనే, ఎదగాలనే అభిలాష స్నేహంలో వుంటుంది. అందుకే స్నేహమంటే అందరికీ ఇష్టంగా వుంటుంది. ఒక వ్యక్తి తనను తాను పూర్తిగా తెరచి ఒక్క స్నేహితుడి దగ్గరే పెట్టగలడు. అది బలమైనా, బలహీనమైనా, మంచియైనా చెడైనా నిర్భయంగా స్నేహితుడితోనే పంచుకోగలము కదా! అందుకే స్నేహం అనే భావనకు ఎంతో విలువ ఏర్పడింది. స్నేహంలో ప్రేముంటది, బాధ్యతుంటది, ఇచ్చిపుచ్చు కోవడమూ, సహనము, ఓదార్పు, సమభావన, సమైక్యత అన్నీ కలిసి వుంటాయి. అందుకే 'స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల... స్నేహమేరా! బతుకుబాటలో నీడనిచ్చే తోడురా!' అని పాడుకోగలుగుతున్నాము. ప్రకృతి గమనాన్ని మనం పరిశీలించినట్లయితే ప్రతి జీవీ సహచరత్వ జీవనాన్నే కొనసాగించింది. ఏ జీవీ ఒంటరిగా లేదు. సహచరత్వమనేది జీవలక్షణంగా క...