వరకట్నం
''ఆడపిల్ల గుండెల మీద కుంపటి'' వంటి డైలాగులు సినిమాల్లోనే కాదు నిత్యజీవితంలోనూ తారాస పడుతుంటాయి. ఆడపిల్ల పుడితే ఆ తల్లే తిరస్కరణకు గురవుతున్న సందర్భాలు కోకోల్లలు. భ్రూణహత్యలకూ ఈ దురాచారమే మూలకారణం.
కట్నం ఇచ్చుకోలేని స్త్రీలను మానసిక క్షోభకు గురిచేయడమే కాదు, చంపడానికి సైతం వెనుకాడటం లేదంటే ఇంతకంటే క్రూరమైన చర్య మరొకటి లేదేమో. కట్నం కోసం వ్యక్తిత్వాలను అమ్ముకొని మానవత్వాలను మరిచి స్త్రీనొక ఆటబొమ్మగా చూడడం శోచనీయం. ఇలాంటి కేసులు విచారించడానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వరకట్న వృక్షాన్ని కూకటి వేళ్ళతో పెకిలించాల్సింది పోయి మన సమాజం దానికి జీవం పోస్తోంది. వరకట్న నిషేధం కోసం చట్టాలు చేసినా ప్రయోజనం కన్పించడం లేదు. వివాహ సమయంలో ఇచ్చిన కట్నం తక్కువైందని, మళ్ళీ ఇవ్వాలంటూ వేధింపుల కేసులు ఎక్కువయ్యాయి.
వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం రెండింటినీ నేరంగా పరిగణిస్తూ ప్రభుత్వం 1961 జులైలో చట్టం తెచ్చింది. ఈ చట్టంలోని లోపాలను సవరిస్తూ 1984లో డౌరీ ప్రొహిబిషన్ ఎమెండ్‌మెంట్ యాక్ట్ తెచ్చారు. అంతేకాకుండా శిక్షకు సంబంధించి 1988లో మళ్ళీ సవరణ చేశారు. వివాహ సమయంలో కానీ, ముందు కానీ వరకట్నం ఇవ్వడం నేరం. ప్రభుత్వ ఉద్యోగులు తాము కట్నం తీసుకోలేదని తెలియజేయాలి. అయినప్పటికీ నూటికి 90శాతం మంది కట్నం తీసుకుంటున్నారు. నూటికో కోటికో ఒకరికి శిక్ష పడుతోంది. వరకట్న హత్యలను కొంతవరకు నిరోధించవచ్చుననే ఆశయంతో 1956 నాటి హిందూ వారసత్వ చట్టం మహిళా హక్కులను మెరుగుపరిచి ఆస్తి హక్కు కల్పించింది. కానీ, ఆశించిన ఫలితం రాలేదు.
వరకట్న వేధింపులకు గురవుతున్న వారిలో పేద, మధ్య తరగతి మహిళలే కాదు.. సంపన్న వర్గాల వారు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, సినీ యాక్టర్లు, వివిధ ఫ్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న మహిళలూ ఉన్నారు. ఈ వేధింపులు తాళలేక మహిళలు ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలనేకం. వివాహిత మహిళల పట్ల భర్త, ఇతర కుటుంబ సభ్యుల శారీరక, మానసిక హింస అమానుషమైనదైనప్పటికీ దానికి తగిన శిక్షలు చట్టాల్లో లేకపోవడం ఆశ్చర్యకరం. కానీ, ఆ తరువాత దానిని సవరించారు. అయినా అమలులో చాలా లోపాలున్నాయి. త్వరిత గతిన కేసులు పరిష్కారం కాకపోతే ఎన్ని చట్టాలున్నా ఉపయోగం ఉండదు. తెలంగాణ రాష్ట్రంలో సఖి కేంద్రాలు, ఫ్రెండ్లీ పోలీసు, షీటీంలు వంటివి ఉన్నప్పటికి న్యాయవిచారణ జరగడంతో ఆలస్యం అవుతుంది. ఇప్పటికీ నాయ్యస్థానాల్లో అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
ప్రతి వ్యక్తి కట్నం ఇవ్వకుండా, తీసుకోకుండా సమాజం మైండ్‌సెట్ మారాలన్నది స్పష్టం. వరకట్న నిరోధక చట్టం ఉన్నా, గృహ హింస నిరోధ చట్టం ఉన్నా స్త్రీలు నిశ్శబ్దంగా ఈ హింసను భరిస్తూ ఉండటంతో వరకట్న సమస్య లేనట్టుగా నేడు సమాజం భావిస్తుంది. ఆ స్థితికి చేరుకున్న 'ఫార్మాలిటీస్' ఎవరికి వారు పరిశీలించుకుంటే 'నో టు డౌరీ' అని గట్టిగా ఎలుగెత్తే అవసరం తెలుస్తుంది.ఈ దిశగా ఒకడుగు ముందుకు వేసి కేరళ వరకట్న నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని సంకల్పించింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి