పిళ్లా విజయకుమారస్వామిరెడ్డి, గంగవరం లక్ష్మిదేవి(ఆరోతరం5)


         పిళ్లా లక్ష్మిరెడ్డి, పిళ్లా రామలక్ష్మి దంపతులకు చివరి సంతానంగా పిళ్లా విజయకుమారస్వామి రెడ్డి 08-07-1964లో రాజంపేటలోని సరస్వతీ పురంలో జన్మించారు. పుట్టినపుడు పెట్టిన పేరు కుమారస్వామి. కాని అతనిని ముద్దుగా బాబు అని పిలిచేవారు. అతని పెద్దక్క విజయలక్ష్మి మరణంతో ఆమెకు గుర్తుగా కుమారస్వామికి విజయకుమారస్వామిగా నామకరణం చేశారు.
           దాదాపు తాను 7 ఏళ్ళ ప్రాయంలో రెండవ తరగతి చదువుతున్నప్పుడు 1971లో అతని తల్లి రామలక్ష్మి ధనుర్వాతంతో ఆకస్మికంగా దివంగతు రాలైంది. తల్లి మరణాంతరం అతనిని అందరూ గారాబంగా చూసేవారు. కొండమ్మవ్వ బాబును ఆప్యాయంగా చూసేది.
          బాబు ప్రాథమిక విద్యాభ్యాసమంతా వారి ఇంటి వెనుక నున్న ప్రాథమిక పాఠశాలలో పూర్తయింది. ఆరవ తరగతి చదివేందుకు ఇంటికి ఎదురుగా సమీపం లో వున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేరారు. కానీ తన పెద్దన్న పిళ్లా దశరథ
రామిరెడ్డి తనను తనతోపాటు తీసుకెళ్లి కడపలో తన దగ్గర వుంచుకుని కడపలోని ఎర్రముక్కపల్లె మున్సిపల్ ఉన్నత పాఠశాలలో చేర్పించాడు. ఆపాఠశాలలో ఆయన తెలుగు పండితులుగా పనిచేస్తుండేవారు. తన అన్న దగ్గర ఉండి చదువు కోవడం కుమారస్వామి అదృష్టమని చెప్పవచ్చు.
         కడపలో ప్రారంభమైన ఉన్నత పాఠశాల చదువు డిగ్రీ చదివేవరకు సాగింది. పదవతరగతి చదువుతున్నప్పుడు 1979సం|| మార్చినెలలో ఆయన తండ్రి పిళ్లా లక్ష్మిరెడ్డికి గుండెలో నొప్పి రావటంతో ప్రభుత్వ ఆసుపత్రిలోచేర్పించారు. అప్పుడు తన తండ్రికి సహాయ కుడిగా వుంటూ అక్కడే చదువుకుంటూవుండేవారు. ఆసు పత్రిలో ఉన్నప్పుడే ఆయన తండ్రిగారు ఆకస్మికంగా గుండె
నొప్పి వచ్చి మార్చి 28న మరణించారు. అంత దు:ఖ   సందర్భంలో కూడా బాబుపరీక్షపై దృష్టి పెట్టి ప్రధమ శ్రేణిలో పాసైనారు. పదవతరగతి ప్రథమ శ్రేణిలో పాసవగానే ఇంటర్మీడియట్ చదువు కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో యం.పి.సి.(ఇ. మీ.) చేరారు. కొత్తగా ఇంగ్లీషు మీడియంలో చేరడంవల్ల (కెమిస్ట్రీ,ఫిజిక్స్ లను సులభంగా అర్థంచేసుకోలేక‌ పోవడంతోఇంటరు ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు.దాంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సీటు రాకపోవడం తో 1981లో అప్పుడే కొత్తగా ప్రైవేటు రంగంలో ఏర్పాటైన ఎస్.వి. డిగ్రీ కళాశాలలో బి.ఏ.(యం. ఈ. ఎస్) చేరారు. దాంట్లో డిస్టింక్షన్ లో పాసయ్యాడు. కళాశాలలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఒకవైపు చదువుకుంటూనే తన అన్నగారు నడుపుతున్న ట్యూషన్ లో విద్యార్థులకు తన వంతు బాధ్యతగా మాథమేటిక్స్ చెప్పేవారు. డిగ్రీ పూర్తయ్యాక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువు కోవడానికి వదినె ద్వారా అన్నగారి అనుమతి పొంది, యం.ఎస్.సి(అప్లైడ్ మాథ్స్) చదివేందుకు తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వ విద్యాలయంలో చేరారు. అక్కడ 1986లో చదువు పూర్తవుతున్న దశలో యల్.ఐ.సి సంస్థలో వచ్చిన ఒక చిన్న ప్రకటన ఆధారంగా అసిస్టెంట్ ఉద్యోగానికి పోటీపరీక్ష రాసినాడు. అందులో అతను విజయం సాధించి యల్.ఐ.సిలో అసిస్టెంట్ గా చేరారు. అప్పటికింకా యం.ఎస్సి ఫైనల్ ఇయర్ పరీక్షలు అయిపోలేదు. 
       యల్.ఐ.సిలో అసిస్టెంట్ గా అప్పట్లో కడప డివిజన్‌లో వున్న నెల్లూరు జిల్లాలో వున్న గూడూరు బ్రాంచి కార్యాలయంలో చేరినారు. 

అప్పుడతని జీతం కేవలం రూ. 900 లు మాత్రమే. చేరిన రెండు నెలల తరువాత ఎం.ఎస్సి ద్వితీయ సంవత్సరం పరీక్షలు పూర్తి చేశారు.ఎం.ఎస్సీ.(అప్లైడ్ మాథ్స్) ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు.
           గూడూరు నుండి కడపకు నెలకు లేదా రెండు నెల్లకోసారి వచ్చివెళుతుండేవారు. గూడూరులో పనిచేస్తున్నప్పుడు అక్కడ కడపనుండి వచ్చిన నాగరాజాచారి, హిందూపురం నుంచి కళ్ళె సతీష్ తో కలసి ఒక గదిలో వుండేవారు. ఆఫీసులో నావల్ రీడర్స్ క్లబ్ ను ఏర్పాటుచేసి నవలలను చదివే అలవాటును పెంచడానికి కృషిచేసేవారు. అక్కడ రెండేళ్ళు అంటే 1988 వరకు పనిచేశారు.కడప నుంచిగూడూరుకు వెళ్లాలంటే రెండు రూట్లున్నాయి. అప్పట్లో బాగున్న రూటు కడప, బద్వేలు, ఆత్మకూరు, నెల్లూరు, గూడూరు. ఇంకో రూటుకడప, రాజంపేట, రాపూరు, గూడూరు ఈ రూటు అప్పట్లో బాగుండేది కాదు.ఇప్పుడు రోడ్లు బాగా వేసినారు. 
         గూడూరు నుండి కడప డివిజనల్ ఆఫీసుకు
బదిలీపై వచ్చేశారు.డివిజినల్ ఆఫీసులో సేల్స్ విభాగంలో అసిస్టెంటుగా చేరినాడు. 
           వచ్చిన వెంటనే అతనికి సహజంగానే పెళ్ళి సంబంధాలు చూశారు.కడపలో గంగాధరం,యల్లా రెడ్డి టీచర్లు కుమారస్వామికి గురువులు. గంగాధరం  యర్రముక్కపల్లెలో నివసించేవారు. కడప మున్సిపల్ ఆఫీసులో క్లర్కుగా పనిచేసే గంగవరం వెంకటరెడ్డి, గంగమ్మగార్ల ప్రధమ పుత్రిక లక్ష్మిదేవి సంబంధం చూశాక గంగాధరం సారు కుమారస్వామికి చాలా సార్లు కౌన్సిలింగ్ ఇచ్చారు. తన అన్న, వదినెలు కూడా ఆమోదం తెలిపారు. వారివివాహం కడప మున్సిపల్ ఆడిటోరియంలో జరిగింది. అదిప్పుడు లేదు. దానిని పడగొట్టి కొత్తగా వై ఎస్ ఆర్ ఆడిటోరియం పేరుతో నిర్మించారు.

          గంగవరం లక్ష్మిదేవి 02-12-1965వ తేదీన
కడపలో జన్మించారు. వారి నివాసం కడపలో మున్సిపల్ హైస్కూల్ (పెద్ద హైస్కూల్) ప్రక్కన వుండే ఆకుల వీధిలో వుంది. ఆ హైస్కూల్ లోనే 10వ తరగతి వరకు చదివింది.ఇంటర్ ప్రభుత్వ బాలికల కళాశాలలో బి.ఏ. డిగ్రీ కోర్సును కోటిరెడ్డి సుబ్బమ్మ మహిళా కళాశాలలో పూరిచేసింది. డిగ్రీ కోర్సును 1986లో పూర్తిచేశారు.
        1988 అక్టోబరు 29లో తనకు వివాహంజరిగిన పిమ్మట వారు కడప యల్.ఐ.సి. క్వార్టర్స్ లో కాపురం పెట్టినారు. అక్కడ రెండేళ్ళు వున్నారు. అప్పటికి వారికి ఒక కుమార్తె 12-10-1990లో జన్మించింది. ఆమెకు శరత్ జ్యోత్స్న అని పేరు పెట్టారు. శ్రీశ్రీ రాసిన శరత్ చంద్రిక ఆధారంగా శరత్ జ్యోత్స్న అనే పేరును పెట్టినారు కుమారస్వామి. అప్పటికే డెవలప్ మెంట్ ఆఫీసరు పోస్టుకు జరిగే పోటీపరీక్ష రాయడం అందులో మంచి ఫలితం సాధించి ఇంటర్యూలో సెలక్ట్ కావడం జరిగింది. కదిరికి పోస్టింగ్ ఇచ్చారు. 
      1990 డిసెంబరు లో కడప నుండి బదిలీ అయి అనంతపురం జిల్లా లోని ధర్మవరంలో వున్న యల్.ఐ.సి. ఆఫీసులో చేరినారు. కదిరి హెడ్ క్వార్టర్ గా  ఇచ్చారు. 1990నాటికి కదిరిలో ఆఫీసు ఏర్పరచలేదు. అదింకా ధర్మవరం బ్రాంచి కిందనే వుండేది. చేరిన ఆర్నెళ్లకు నవంబరు 1990లో కదిరిలో కొత్త శాఖను ప్రారంభించారు. అప్పటి నుండిఇప్పటిదాకా అక్కడే డెవలప్ మెంట్ ఆఫీసరుగా పనిచేస్తూనే వున్నారు.
           కదిరిలో జనవిజ్ఞాన వేదిక పేరుతో శాస్త్రీయ భావాలను ప్రచారం చేసే ఒక సంస్థ ఏర్పడింది. ఆ సంస్థకుప్రధాన కార్యదర్శిగా టెలికాంలో పని చేస్తున్న హనుమంతరెడ్డిగారుండేవారు.ఆయన స్ఫూర్తితో 1992లో జనవిజ్ఞాన వేదికలో చేరాక ఆయనతో కలిసి గ్రామాలలో శాస్త్రీయ ప్రచారం కోసం అనేక నాటికలు, సమావేశాలు ఏర్పాటుచేసిప్రసంగించే వారు. ప్రభుత్వం నిర్వహించిన అక్షరాస్యతా ఉద్యమం లో పాల్గొన్నారు.జనవిజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి గా  కదిరి ప్రాంతంలో విద్యార్ధుల కోసం అనేక విజ్ఞానదాయక పోటీలు పెట్టి శాస్త్రీయ ప్రచారం చేసేవారు.
         19-4-1995లో ఆ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. అతని పేరు యశ్వంత్ అని పేరు పెట్టారు.ఇతనికి అతని అమ్మ లక్ష్మిదేవి ఆ పేరును పెట్టింది. అతని మేనమామ రామకృష్ణారెడ్డి ముద్దుగా చోటూ అని పిలిచినాడు. చోటూ అని ఇంట్లో వాళ్ళందరూ ఇప్పటికీ ముద్దుగా పిలుస్తుంటారు.
          1996లో జనవిజ్ఞాన వేదికను వదిలిపెట్టి ప్రముఖ కార్మిక సంస్థ సి, ఐ.టి.యు. ప్రధాన కార్యదర్శిగా బాధ్యత తీసుకున్నారు. తన ఉద్యోగం చేసుకుంటూ విరామ సమయాల్లో కార్మికులతో చర్చిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ వారిని సంఘటితం చేయడానికి ప్రయత్నించారు.  
           ఎలక్ట్రిసిటీ బోర్డును ప్రవేటీకరిస్తున్నప్పుడు రెస్కోలను రద్దు చేస్తున్నప్పుడు ముందుండి కార్మికు లను నడిపించారు. అంగన్ వాడీల ప్రవేటీకరణకు వ్యతిరేకంగా అంగన్ వాడి సంఘా లతో కలిసి పోరాటం సాగించారు. చాలా మంది కార్మికులకు సంఘ బలాన్ని వివరిస్తూ క్లాసులు చెప్పేవారు. బీడీ కార్మికుల సమస్యలపై బీడీ కార్మికుల ఇళ్లకు వెళ్ళి వారిని సంఘటితం చేస్తూ అనేక పోరాటాలు నిర్వహించేవారు.
         అనంతపురంలో శారదానగర్ లో ఇల్లు కట్టాక పిల్లల చదువుల నిమిత్తం 25-05-2002లో అక్కడికి మకాం మార్చారు. అప్పుడు యశ్వంత్ (చోటూ)2వ తరగతి. శరత్ జ్యోత్స్న 7వ తరగతి, వారిద్దరిని యల్.ఆర్.జి. స్కూలులో చేర్పించాడు. అనంతపురం వచ్చాక కొన్నేండ్లు కదిరిలో రూం తీసుకొని రెండు రోజులకోమారు అనంతపురం వస్తూపోతూ వుండేవాడు కుమారస్వామిరెడ్డి.
తరువాత రోజూ వస్తూపోతూ వుండటం కూడా జరిగింది.
         యశ్వంత్ తాను హైదరాబాదులో చదువుతా ననగానే అక్కడ ఉప్పల్ నారాయణ కాన్సెప్ట్ స్కూలులో చేర్పించారు. శరత్ జ్యోత్స్నను ఇంటర్ చదివించడానికి హైదరాబాద్ లో చైతన్య కళాశాలలో చేర్పించారు. మియాపూర్ లో ఉండే కాలేజిలో చదివింది. తరువాత హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్న అబిడ్స్ లోని స్టాన్లీ ఇంజనీరింగ్ మహిళా కళాశాలలో బి.టెక్ పూర్తిచేసింది. యశ్వంత్ నల్లకుంటలో వున్న నారాయణ జూనియర్ కాలేజిలో ఇంటర్ పూర్తి చేసినాడు. జ్యోత్స్న యం.బి.ఏ. కోసం బెంగళూరు లో వున్న ఆర్.యన్.యస్.ఐ.టీ కాలేజిలో చేరింది.
యశ్వంత్ కోమెడిక్ పరీక్షలో పాల్గొని పాసై బిటెక్ కోర్సు చేయడానికి జె.యస్.యస్. కాలేజిలో చేరినాడు.
        కదిరి నుండి అనంతపురంలోని స్వంత ఇంట్లోకి కుటుంబం మారిన తరువాత సి.ఐ.టి.యు ను వదలివేశారు. డా|| గేయానంద్ గారి సలహా మేరకుసాహిత్యరంగంలో అప్పుడే ఏర్పడిన సాహితీస్రవంతి కన్వీనరుగా బాధ్యత తీసుకున్నారు. అప్పటి నుండి ఇప్పటివరకు సాహిత్యరంగంలో విశేష కృషి చేసినారు.
సాహితీస్రవంతికి జిల్లా ప్రధాన కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షులుగా పదవులునిర్వహించారు. ప్రస్తుతం జిల్లా గౌరవాధ్య క్షులుగా ఉంటున్నారు.
         వేమన సాహిత్యంపై ప్రొఫెసరు రాచపాళెంగారి సహకారంతో రాష్ట్రసదస్సును నిర్వహించారు. ప్రపంచీకరణ పై పోటెత్తిన కవితాసంద్రం, మేడే-కార్మికులహక్కుల దీక్షాదినం, అనంతసాహితీ సమాలోచన, ఆధునిక సాహిత్య పరిణామక్రమం మొదలైన గ్రంథాలను రాసి ప్రచురించారు. అనంతకవితా స్వరాలు సంకలనానికి సంపాదకత్వం వహించారు. ఒక కవితాసంపుటి, విశదపేరు తో సమీక్షా వ్యాసాల సంకలనంలను త్వరలో వెలువరించేందుకు సన్నాహాలు జరుపు తున్నారు.పిళ్లాకుమారస్వామి పేరుతో తన రచనా వ్యాసంగం సాగిస్తున్నారు.
           2016 ఫిబ్రవరిలో అనంతపురం నుండి కుమారస్వామిరెడ్డి తన మకాంను కదిరికి మార్చినారు. అడపాలవీధిలో వైయస్. ఆర్.నగర్ లో చేరినారు. ప్రస్తుతం లైట్ హౌస్ ఎదురుగా వున్న ఇంట్లో నివసిస్తున్నారు. 2016లో తన తండ్రి పిళ్లా
లక్ష్మిరెడ్డి, తల్లి పిళ్లా రామలక్ష్మి జ్ఞాపకార్థం ఒక సాహిత్య పురస్కారాన్ని అనంతపురంజిల్లా స్థాయిలో ఒక పోటీ నిర్వహించి ఉత్తమకథారచయిత కు అందజేశారు.
        ఆయన కుమార్తె శరత్ జ్యోత్స్నకు కదిరి దగ్గరున్న తలుపుల మండలంలోని ఉబ్బరవాండ్ల పల్లె వాస్తవ్యులైన దొడ్డావులసురేంద్రరెడ్డి, ఉషారాణి దంపతుల కుమారుడు దొడ్డావుల సుధీర్ తో 2017,అక్టోబరు 6వ తేదిన కదిరిలో వున్న టి.టి.డి కళ్యాణ మండపం లో  కళ్యాణం జరిపించినారు.











కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చాణక్య ప్రకారం, ఇలాంటి వారు ఎప్పటికీ ధనవంతులు కాలేరు, కారు..

గోత్రం

This is wealth