పిళ్లావారు అనే పేరు ఎలావచ్చింది?
పులివెందుల ప్రాంతంలోని సింహాద్రిపురం మండలం, ముసల్ రెడ్డి పల్లెలో వీరి కుటుంబంలో ఒకామెకు ఐదువేళ్ళు బదులు ఆరువేళ్ళు పుట్టుకతో వచ్చినాయి. కొంతమందికి జన్యు లోపాల కారణంగా ఐదువేళ్ళతో పాటు ఆరోవేలు కూడా పుడుతుంది. కానీ ఇది చాలాబలహీనంగా ఉంటుంది. స్వతంత్రంగా అది కదలదు. వేలాడుతూవుంటుంది. దాన్ని పిల్లవేలు అని అంటూంటారు. అలా పిల్లవేలు వున్న అమ్మాయి కుటుంబం కావటంతో వాళ్ళను పిళ్లా వాళ్లు అని ఆపల్లెలో పిలవటం సహజంగా జరిగిపోయింది. అలా పిళ్లావారు అనే ఇంటి పేరు మెల్లగా స్థిరపడింది. కాకపోతే అంతకు ముందు వున్న ఇంటి పేరు ఏమిటో స్పష్టంగా ఎవరికీ తెలీదు.
వంశవృక్షం రాస్తున్నప్పుడు పిళ్లా వారు చాలామంది ఉన్నారని అర్థమయింది. ప్రస్తుతం
మాతండ్రిగారి వైపువారి వివరాలతో మాత్రమే ఈ వంశవృక్షం రాయడం జరిగింది. మాతండ్రిగారి పెద్దల కుటుంబ వివరాలను రేఖీయ మాత్రంగా చివరలో ఒక చార్టు ద్వారా చూపించాను.
పిళ్లా వారిది ప్రధానంగా వ్యవసాయ కుటుంబం.భవిష్యత్తు తరాలవారికి ముందు తరాలవారి గురించి కొంత అవగాహన
ఏర్పడటానికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో వంశవృక్షము రాసినాను. ఈ వంశవృక్షాన్ని మా నాన్నగారు(పిళ్లా లక్ష్మిరెడ్డి) ఒక చార్టులో మాత్రమే చూపించారు. అయితే వాళ్ల పుట్టిన తేదీలు వగైరాలతో జాతకాన్ని రాయించారు. ఆ వివరాలతో నాకు తెలిసిన విషయాలతో ఈ గ్రంథ రచనకు పూనుకున్నాను.
రాయలసీమ జిల్లాల్లో వ్యవసాయదారు లైన కాపులను రెడ్లు అంటారు. గతంలో పేరు చివర రెడ్డి అని పెట్టుకొనేవారు కాదు. ఈ రోజుల్లో అందరూ 'రెడ్డి' అని పేరు చివర పెట్టుకుంటు న్నారు. గతంలో గ్రామాలలో రెడ్డి, కరణం పేర్లతో ఉన్న అధికారులు భూముల లెక్కలు, పన్ను వసూళ్లు మొదలైన గ్రామ పరిపాలన ప్రభుత్వ పరంగా సాగించేవారు. సాధారణంగా రాయలసీమలో కాపు కులస్థులే రెడ్డి పని చేసినారు. వీరిలో ఎక్కువ మంది 'రెడ్డి' పని ,నేడైతే విఆర్ఓ పని, చేయడం వలన పేర్లకు చివర
రెడ్డి చేరింది. రెడ్లలో పలు శాఖలున్నాయి. పోకనాటి, పెడకంటి, కొడిదె, మఠాటి, పంట,
కొండ ఇలా చాలా తెగలున్నాయి. వీరు ఒకరికొకరు పెళ్లి సంబంధాలు జరిపుకోరు. కాలక్రమంలో అవన్నీ మాసిపోయి ఇప్పుడు అన్ని శాఖలవారు ఒకరినొకరు పెళ్లి సంబంధాలు కలుపుకుంటు న్నారు. పిళ్లా వారిది చిన్న కొడిదె శాఖ. వీరిది
ధనంకుల గోత్రం. బంగారం కరిగే సందర్భాలలో చూడకూడ దని ఈ గోత్రం చెబుతుంది. శూద్రులలో గోత్రం అంటే ఆ గోత్రీకులు దానికి దూరంగా
ఉండాలని పూర్వం ఎప్పుడో నిబంధన పెట్టినారు. బహుశ ఇవి కూడా భవిష్యత్తులో రూపుమాసి పోవచ్చు. సాధారణంగా స్వగోత్రీకులు వివాహం చేసుకోరు.స్వగోత్రీకులు అన్నదమ్ముల వరుస అవుతారు.
పిళ్లా విజయకుమారస్వామిరెడ్డి(పిళ్లా విజయ్)
కదిరి, 19.8.2020
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి